నటుడు మనోజ్ తల్లి మృతి!
on Dec 8, 2022
బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఇంట్లో విషాదం అలుముకున్నది. ఆయన తల్లి గీతాదేవి (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా గీతా దేవి ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో 20 రోజుల క్రితమే ఆమెను ఢిల్లీలోని పుష్పాంజలి మెడికల్ సెంటర్ అండ్ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచారు.
ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వారా గీతాదేవిగారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలుపుతున్నారు. గీతాదేవికి మనోజ్‌తో పాటు మరో ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇక మనోజ్ తండ్రి ఆర్కే బాజ్‌పేయి గతేడాది అక్టోబర్‌లో మరణించిన విషయం తెలిసిందే.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'సత్య' మూవీ మనోజ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత అనేక బాలీవుడ్ చిత్రాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసిన మనోజ్.. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్‌లో ఒకరిగా చోటు సంపాదించాడు. మనోజ్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా 'హ్యాపీ' సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. మనోజ్ నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ కూడా నేషనల్ వైడ్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.